తెలంగాణాలో ఓటేస్తే ఏపీలో కట్… వైసీపీ డిమాండ్ ఇదే…!

ANDHRA PRADESH POLITICAL

తెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఏపీలో అధికార వైసీపీ ఒక సీరియస్ డిమాండ్ ని తెర మీదకు తెచ్చింది. ఏపీ నుంచి తెలంగాణాలో వెళ్లి అక్కడ సెటిల్ అయి ఓట్లు పొందిన వారికి ఏపీలో ఓటు హక్కు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైసీపీ తరఫున మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం అందించింది. అంతే కాదు ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్ళి అక్కడ ఓటు హక్కు పొందిన వారి జాబితాను ఆధార సహితంగా ఎన్నికల సంఘానికి అందించింది.

ఏపీకి సరిహద్దు జిల్లాలుగా ఉన్న ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉంటున్న వారంతా ఏపీ నుంచి చాలా కాలం క్రితమే వెళ్లి కాపురాలు ఉంటున్నారు. వారికి అక్కడే ఓటు హక్కు ఉంది. ఆధార్ కార్డు సహా మొత్తం అడ్రస్ అంతా అక్కడే ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

వీరంతా తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో జనాభాగా ఉంటున్నారని ఎన్నికల సంఘం దృష్టికి వైసీపీ నేతలు తీసుకుని వచ్చారు. నిబంధనల ప్రకారం రాజ్యాంగం మేరకు చూస్తే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని కానీ తెలంగాణాలో ఓటు వేసిన వారు ఏపీలో కూడా ఓటు వేయడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ వస్తున్నారని వైసీపీ మంత్రులు జోగి రమేష్ మేరుగ నాగార్జున అంటున్నారు.

చాలా మందికి ఏపీ తెలంగాణాలో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని ఇది ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీలో ఓట్లు కట్ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని వారు అంటున్నారు. ఇక గత ఎన్నికల నాటికే ఏపీలో 16 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వారు ఆరోపించారు. దాన్ని అపుడే ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చామని అన్నారు. భోగస్ ఓట్లు లేకుండా చూడాలని తాము కోరుతూంటే విపక్షాలు దొంగ ఓట్లు వైసీపీ చేర్పిస్తోందని ప్రచారం చేయడం కంటే దారుణం ఉండదని వారు అన్నారు. వైసీపీ ఒక నిబద్ధత కలిగిన పార్టీగా వారు పేర్కొన్నారు.

Spread the love