ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, తెల్లబడటం, చిట్లడం. అనేక మందికి ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వులతో చక్కటి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. మందార వల్ల వెంట్రుకల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఒక 8 చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని కడిగి ముద్దలా చేసుకోవాలి. కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టుకుని రాత్రి సమయంలో తలకు రాసుకుని ఉదయం తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి. గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగును తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
దీన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది. మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందార ఆకులను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి 50 నిమిషాల తర్వాత కడిగితే జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పువ్వులు వేసి కొద్దిసేపు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆకుల్ని ముద్దలా చేసి, కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూలా మారుతుంది. దీన్ని తలకు రాసి షాంపూలా ఉపయోగించుకోవచ్చు. 8 మందార పువ్వులను ముద్దలా నూరుకోవాలి. తర్వాత దీన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. ఈ మిశ్రమం కండిషనర్‌లా కూడా పనిచేస్తుంది.