తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది సిరిసిల్ల ప్రజలే.. మీరు గెలిపించకపోతే నాకంటూ ఓ గుర్తింపు ఉండేది కాదని మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి గర్వపడతా.. తనను ఇంతలా ఆదరించిన సిరిసిల్ల ప్రజల రుణాన్ని ఏమి ఇచ్చిన తీర్చుకోలేనని అన్నారు. అభివృద్ధిలో సిరిసిల్లను పరుగులు పెట్టించామని.. సిరిసిల్లకు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని కాంగ్రెస్ అంటోంది.. ఆరునెలలకో వ్యక్తి సీఎం అయ్యే మార్పు కావాలా.. రైతు బంధు ఆగిపోయే మార్పు కావాలా అని ప్రశ్నించారు. లేక 3 గంటల కరెంట్ వచ్చే మార్పు కావాలా.. సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యే మార్పు కావాలా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.