తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క సోషల్ మీడియాను ఊపేస్తూ ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఈల గుర్తుపై పోటీ చేస్తున్న బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీ చేయడంతో పాటు, ఆమె ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో అందరి దృష్టి బర్రెలక్క మీద కేంద్రీకృతమైంది. ఇక బర్రెలక్కను పోటీ నుండి విరమించుకోవాలని చేసిన ఒత్తిడి, ఆమె సోదరుడిపై చేసిన దాడి వెరసి హైకోర్టు ఆమెకు భద్రత ఇవ్వాలనిన్ సూచించింది.
ఇక రాష్ట్రంలో అనేక జిల్లాల నుండి బర్రెలక్క ఎన్నికల ఖర్చులకు నిధుల వరద కురిసింది. ఎవరికి వారు అక్కడికి వెళ్లి మరీ ఆమెకు తమ వంతు సాయం చేసి మద్దతును ప్రకటించి మరీ వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న బర్రెలక్కకు తాజాగా యానాం ప్రజల మద్దతు లభించింది.
యానాం ప్రజలు బర్రెలక్క గెలుపు కోసం, అలాగే ఆమె భవిష్యత్ చదువుల కోసం 5న్నర లక్షల రూపాయలను ఆమెకు అందించారు. ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వయంగా ఆమెను కలిసి అందించి, మద్దతు తెలిపారు. తన వంతుగా ఆమెకు రూ.లక్ష సాయం అందించారు. రాజకీయాల్లోకి మరెందరో ధైర్యవంతులైన యువత ముందుకు వచ్చేందుకు బర్రెలక్క ఆదర్శంగా నిలిచిందని మల్లాడి కృష్ణారావు అభినందించారు.