మరో కొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు వస్తాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో చేరితే స్వాగతిస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
షర్మిల రావచ్చన్న గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని షర్మిల ప్రయత్నం చేశారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం కూడా నడిపారు. ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చలు కూడా జరిపారు. ఇక విలీనం లాంఛనమే అని అంతా అనుకున్న సమయంలో విలీనం జరగలేదు కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
పైగా షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపగలరని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. ఇలాంటి తరుణలో ఇప్పుడు గిడుగు రుద్రరాజు.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉండగా.. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇద్దరి మధ్య పోటీ అసక్తికరంగా మారుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో జీవం పోసుకునే అవకాశాలు మెరుగుపడుతాయి.